GT vs PBKS: గుజరాత్ హోమ్ గ్రౌండ్ లోనే.. గుజరాత్‌ను చిత్తు చేసిన పంజాబ్.! 20 d ago

IPL 18 5వ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (GT)..పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో GT తమ సొంత గడ్డపై పంజాబ్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించి IPL 2025లో తమ మొదటి విజయాన్ని నమోదు చేసుకున్నారు.
టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకోవటంతో పంజాబ్ బ్యాటింగ్‌కు రావాల్సివచ్చింది. క్రీజులోకి దిగిన పంజాబ్ బ్యాటర్లు మొదటి ఓవర్లో తడపడ్డారు. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఔట్ కావడంతో క్రీజులోకి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ త్వరగానే రావాల్సివచ్చింది. పంజాబ్ ఎక్కువ సొమ్ము పెట్టి (26.5 Cr) అయ్యర్‌ను తీసుకుంది. పంజాబ్ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా శ్రేయస్ అయ్యర్ ఆడాడు. బరిలోకి దిగినప్పటి నుండి ఫోర్లు, సిక్సర్లతో ఎడాపెడా బాదుతూనే ఉన్నాడు.
ప్రియాంష్ ఆర్య (47 ఆఫ్ 23) కూడా అయ్యర్‌కు తగ్గట్టు అదరకొట్టాడు. దీంతో 6 ఓవర్లు వచ్చే సరికి పంజాబ్ 70 పరుగులకుపైగా చేసింది. ఇక GT తమ ప్రధాన బౌలర్ రషీద్ ఖాన్ ను తీసుకొచ్చింది. అయినా సరే పంజాబ్ స్కోరును మాత్రం ఆపలేకపోయారు. అతిభయంకరమైన బాటింగ్ తో శ్రేయస్ అయ్యర్ 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
IPL లో తన తొలి శతకం సాధించేలా కనిపించాడు... కానీ అనూహ్యంగా సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఔట్ కాకపోయినా.. చివరి ఓవర్‌లో ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండా.. సెంచరీని మిస్ చేసుకున్నాడు. పంజాబ్ మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోయిన చివరిలో శశాంక్ సింగ్ (44 అఫ్ 16) చెలరేగిపోయాడు. సిరాజ్ వేసిన ఆఖరి ఓవర్లో ఏకంగా 23 పరుగులు చేసాడు. 20వ ఓవర్‌లో 4 2 4 4 Wd 4 4 స్కోరు నమోదు చేసి టీమ్ కు భారీ స్కోరును అందించాడు. దీంతో పంజాబ్ ఇన్నింగ్స్ 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఇది పంజాబ్‌కు రెండో అత్యధిక స్కోరు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయి కిషోర్ 3 వికెట్లు తీయగా.. కగిసో రబాడా 1, రషీద్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు.
భారీ స్కోర్ లక్ష్యంగా బరిలోకి దిగిన GT ఆటగాళ్లు తగినంత ప్రారంభం అందించలేక పోయారు. పరుగులు చేసేక్రమంలో శుభ్‌మన్ గిల్ (33) తక్కువ సమయంలోనే పెవిలియన్‌కు వెనుతిరిగాడు. దీంతో పవర్ ప్లేలో పెద్దగా పరుగులు చేయలేకపోయారు. జోస్ బట్లర్ (54).. సాయి సుదర్శన్ (74) భాగస్వామ్యంతో మళ్లీ GT జట్టు ఊపు అందుకుంది. రూథర్ ఫోర్డ్ (46) మెరుపు ఇన్నింగ్స్ తో GT కి గెలుపు ఖరారు అనుకునే సమయంలో వచ్చాడండి RCB మాజీ బౌలర్ విజయ్‌కుమార్ వైశాక్. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి గుజరాత్ వైపు ఉన్న మ్యాచ్ ని తిప్పేసాడు. అద్భుతంగా బౌలింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అసలు పంజాబ్ విజయంలో కీ-రోల్ పోషించాడు.
ఇక ఆఖరి ఓవర్ కి మ్యాచ్ విజయం కోసం 27 పరుగులు చెయ్యాల్సి ఉండగా.. అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి.. పంజాబ్ కు విజయాన్ని అందించాడు. 5 వికెట్ల నష్టానికి GT 232 పరుగులు మాత్రమే చేయగలిగింది.
పంజాబ్ జట్టుకు కెప్టెన్ గా తన తొలి మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. తన బాటింగ్ నైపుణ్యంతో పంజాబ్ తన మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టాడు. గుజరాత్ లాంటి పెద్ద టీమ్ ని పెద్దగా పరిచయం కూడా లేని ప్లేయర్లతో ఓడించి తనని తాను నిరూపించుకున్నాడు.
ఇవాళ మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగబోతుంది. రాజస్థాన్ రాయల్స్ (RR) మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ గువాహటి బర్సపారా స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 PM ISTకు ప్రారంభంకానుంది.